ఏపీ హైకోర్టుకు కొత్తగా ముగ్గురు న్యాయమూర్తులు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కొత్తగా మూడు న్యాయమూర్తుల పోస్టుల భర్తీ కోసం సుప్రీంకోర్టు కొలీజియం ముగ్గురు న్యాయాధికారుల పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అందులో గంధం సునీత, ఆలపాటి గిరిధర్, చింతలపూడి పురుషోత్తం కుమార్ ఉన్నారు. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో మే 4న సమావేశమైన కొలీజియం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టు మే 05న విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
37 న్యాయమూర్తుల పోస్టులు మంజూరైన ఏపీ హైకోర్టులో ప్రస్తుతం 32 మంది సేవలందిస్తున్నారు. 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అందులో మూడు పోస్టుల భర్తీకి అవసరమైన కార్యాచరణను కొలీజియం చేపట్టింది. మరోవైపు ప్రస్తుతం ఉన్న న్యాయమూర్తుల్లో జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్ ఈ నెల 20న, జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ 27న పదవీ విరమణ చేయనున్నారు.